-
వేసవి సెలవుల్లో పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి
-
చెరువులు, కాలువల వద్దకు పంపవద్దు
-
దొంగతనాలు, వడదెబ్బపై పోలీసుల కీలక సూచనలు
ధర్పల్లి, ఏప్రిల్ 21 : వేసవి కాలం దృష్ట్యా ప్రజలు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని ధర్పల్లి పోలీసులు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న ఎండలు, స్కూళ్లకు సెలవుల నేపథ్యంలో పిల్లల భద్రతతో పాటు ఆస్తుల రక్షణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పిల్లల భద్రత మన బాధ్యత ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండటంతో చిన్నారులు ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటారని, ఈ క్రమంలో వారు తల్లిదండ్రులకు తెలియకుండా బావులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని పోలీసులు కోరారు. నీటి వనరుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఆపదలను ముందే నివారించాలని పేర్కొన్నారు.
దొంగతనాల పట్ల జాగ్రత్త ఎండల తీవ్రత కారణంగా చాలామంది రాత్రి వేళల్లో ఇళ్లకు తాళాలు వేసి మేడలపై లేదా ఆరుబయట నిద్రిస్తుంటారని, దీనిని ఆసరాగా చేసుకుని దొంగతనాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
-
విలువైన వస్తువులు, నగదును బీరువాల్లో కాకుండా దొంగలు గుర్తించని సురక్షిత ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలి.
-
అనుమానితులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.




