-
జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు, అఖిలపక్ష నేతలు
-
ప్రభుత్వం మాట తప్పిందంటూ ఆగ్రహం.. భారీగా నిలిచిన ట్రాఫిక్
-
ఆందోళనకారుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు తరలింపు
జైనథ్, ఏప్రిల్ 21 : రైతులు పండించిన శనగలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో రైతులు కదం తొక్కారు. మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పోరాటానికి అఖిలపక్ష నేతలు పూర్తి మద్దతు ప్రకటించి రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
లక్ష క్వింటాళ్ల దిగుబడి.. 24 వేలకే పరిమితమా?
ఈ సందర్భంగా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు. “శనగలను ఈనెల 30వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని అధికారికంగా ప్రకటించి, తీరా ఇప్పుడు కోటా పూర్తయిందని చెప్పడం సిగ్గుచేటు. మండలంలో లక్షా పది వేల క్వింటాళ్ల మేర పంట దిగుబడి రాగా, ప్రభుత్వం కేవలం 24 వేల క్వింటాళ్లు మాత్రమే కొనడం ఏంటని?” ఆయన ప్రశ్నించారు. శనగలే కాకుండా జొన్న పంటను కూడా కొంటామని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ వైఖరిపై నిరసన
మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గింజను కొనుగోలు చేసినట్లుగా, ప్రస్తుత ప్రభుత్వం కూడా 18 గ్రామాల పరిధిలోని శనగ, జొన్న పంటను పూర్తిగా సేకరించాలని డిమాండ్ చేశారు. రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పోలీసుల జోక్యం – అరెస్టులు
రాస్తారోకోతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, వెంకట్ రెడ్డి, రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న, అనిత రెడ్డి, స్వామి మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




