-
రాష్ట్రస్థాయిలో మెరిసిన మంచిర్యాల జిల్లా విద్యార్థులు
-
మైనారిటీ గురుకులాల అధ్యాపకుల కృషిని కొనియాడిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఏప్రిల్ 21
: ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన మైనారిటీ గురుకుల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరును చాటారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ మైనారిటీ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన విద్యార్థులు సాధించిన విజయాలను పురస్కరించుకుని మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో వారిని ఘనంగా సన్మానించారు.
రాష్ట్రస్థాయిలో రెండో స్థానం గర్వకారణం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనే రెండో స్థానాన్ని దక్కించుకోవడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
గురుకులాల క్రమశిక్షణే విజయరహస్యం
ఈ ప్రతిభ కేవలం విద్యార్థుల పట్టుదలే కాకుండా, ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకుల నిరంతర కృషి ఫలితమేనని కలెక్టర్ కొనియాడారు. మైనారిటీ గురుకులాల్లో (టెమ్రిస్) అందుతున్న నాణ్యమైన విద్య, వసతులను తల్లిదండ్రులు గమనించాలని, తమ పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రోత్సహించారు.
పాల్గొన్న అధికారులు:
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (DMWO) నీరటి రాజేశ్వరి, ఆర్.ఎల్.సి (ఆసిఫాబాద్ & మంచిర్యాల) షగుఫ్తా ఫిర్దౌస్, విజిలెన్స్ ఆఫీసర్ తహరుద్దీన్, అకాడమిక్ కోఆర్డినేటర్ రిజ్వాన్ పాల్గొన్నారు. అలాగే మంచిర్యాల ప్రిన్సిపాల్ సంధ్య, బెల్లంపల్లి ప్రిన్సిపాల్ యం.డి. నీలు మరియు ఇతర ఉపాధ్యాయ బృందం హాజరై విద్యార్థుల విజయోత్సాహంలో పాలుపంచుకున్నారు.




