-
బిజెపి, కాంగ్రెస్‌లకు ఓట్లు కావాలి కానీ ఆత్మాభిమానం అక్కర్లేదా?
-
పార్లమెంట్లో తెలంగాణను అవమానించడంపై జోగు రామన్న ఆగ్రహం
-
కలెక్టర్ చౌరస్తాలో భారీ నిరసన ర్యాలీ
ఆదిలాబాద్, ఏప్రిల్ 18 (ప్రజా సాక్షి): పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ విషం చిమ్ముతున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు , డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ చౌరస్తా వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, తేజస్వి సూర్యల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి తమ నిరసనను తెలియజేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణను కించపరిచేలా ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్రం సాధించిన పురోగతిని గుర్తించకుండా తక్కువ చేసి చూపే వక్రబుద్ధిని బిజెపి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుండి 16 మంది బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, తెలంగాణను అవమానిస్తుంటే అభ్యంతరం చెప్పకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
రాజీనామాలు చేయని నాడు.. నేడు విషం
తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ డిమాండ్ మేరకు పదవులకు రాజీనామా చేయమంటే నాడు కిషన్ రెడ్డి తప్పించుకుని తిరిగారని జోగు రామన్న గుర్తు చేశారు. మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు సైతం పలు సందర్భాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టారని ఆరోపించారు. ఇప్పుడు అదే బాటలో యువ ఎంపీలతో విషం చిమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా బిల్లు పేరుతో వంచన
డీలిమిటేషన్, మహిళా బిల్లు పేరుతో కేంద్ర ప్రభుత్వం యావత్ మహిళా సమాజాన్ని మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం మహిళల నుండి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
పాల్గొన్న నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో అజయ్, నారాయణ, గండ్రత్ రమేష్, యూనిస్ అక్బానీ, సాజిత్ ఉద్దీన్, మెట్టు ప్రహ్లాద్, దాసరి రమేష్, అన్నేలా వసంత్, సలీమ్, ధమ్మా పాల్, కొండ గణేష్, పందిరి భూమన్న, ప్రమోద్, ప్రేమల, పర్వీన్, కరుణ, ఉమ, తన్వీర్, అనిల్ కాంబ్లే, సూర్య ప్రకాష్, దివిటి రాజు తదితరులు పాల్గొన్నారు.




