
విశాఖపట్టణం (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : ఈనెల 26 నుండి 29 వరకు తిరుపతిలో నిర్వహించనున్న ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. మన్మధరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. పైడిరాజు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఆదివారం మధురవాడ జాతీయ రహదారి వద్ద ముఠా కార్మికులతో సమావేశమైన నేతలు, మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి కార్మికులలో చైతన్యం నింపారు. 1920లో స్థాపించబడిన ఏఐటీయూసీ దేశంలోనే తొలి కార్మిక సంఘమని, లాలా లజపతిరాయ్ నుంచి సుభాష్ చంద్రబోస్, వి.వి. గిరి వంటి మహనీయులు దీనికి నాయకత్వం వహించారని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ మహాసభల్లో కీలక పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక సంఘం నాయకులు వెంకటరెడ్డి, చిన్నారావు, తోగులరెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

