
రాజన్న సిరిసిల్ల (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) విద్యార్థినులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో సిరిసిల్ల కేజీబీవీకి చెందిన కీర్తన (BiPC) 440కి 436 మార్కులు, మర్రిపల్లికి చెందిన బి. మమత (MPC) 470కి 466, రుద్రంగికి చెందిన జి. మమత (MPC) 466 మార్కులతో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. అలాగే ఒకేషనల్ విభాగాల్లో తంగాళ్లపల్లికి చెందిన ఎల్. శృతి (MPHW) 490 మార్కులు, వేములవాడకు చెందిన అక్షిత (AIML) 486 మార్కులతో మెరిశారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వీర్నపల్లి ఎంపీసీ 95 శాతం, సిరిసిల్ల బైపీసీ 96 శాతం ఉత్తీర్ణత సాధించగా, తంగాళ్లపల్లి, వేములవాడ కేజీబీవీలు పలు విభాగాల్లో 100 శాతం ఫలితాలను నమోదు చేశాయి. జిల్లా మొత్తం మీద 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.




