
మంచిర్యాల (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మైనారిటీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఘనవిజయం సాధించారు. ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో అమ్ములు సింధుజా 973 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, గజానని, మహేక్ నాజ్నిన్ చెరో 968 మార్కులతో సత్తా చాటారు. ఎంపీసీ విభాగంలో హిరణ్య 968, తేజస్విని 964 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరంలో మేఘన 438/440 మార్కులతో రాష్ట్రస్థాయిలో మెరవగా, ఎంపీసీలో ఉమైమా సిద్ధిఖా 455 మార్కులతో విజయం సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 98 శాతం, ప్రథమ సంవత్సరంలో 97.2 శాతం ఉత్తీర్ణతతో కళాశాల జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. 900కు పైగా మార్కులను 25 మంది విద్యార్థినులు సాధించడం పట్ల ప్రిన్సిపల్ ఎండి. నీలు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులను ఘనంగా అభినందించారు.




