
మంచిర్యాల (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో కానిస్టేబుల్ దిలీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ముఖ్య అతిథిగా పాల్గొని వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు భారత రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కులు మరియు బాధ్యతలపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి పరిమితం కాదని, దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడని ఆయన కొనియాడారు. సమాజం కోసం తన జీవితాన్ని ధారపోసిన బాబాసాహెబ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోతుకు సుదర్శన్, ప్రభాకర్, పోలు శ్రీనివాస్, మద్ది శంకర్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని చాటిచెప్పేలా సాగిన ఈ కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.




