
మేడ్చల్ మల్కాజ్గిరి ( నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా డివిజన్ పరిధిలోని చారిత్రాత్మక చెన్నకేశవ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక కల్యాణం కోసం జరిగే ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమని, ఆ చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలను ఆయన అభినందించారు. ఆధ్యాత్మిక భావనతో పాటు సామాజిక ఐక్యతకు ఇటువంటి వేడుకలు వేదికగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలతో కాప్రా పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.


