
గడిచిన దశాబ్ద కాలంలో భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ 38రెట్లు వృద్ధి చెందింది. వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు ప్రతి ఒక్కరూ యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్‌పై ఆధారపడుతున్నారు. అయితే ఈ సౌలభ్యంతోపాటు సైబర్ నేరగాళ్లు కూడా తమ రూటు మార్చారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2021లో కేవలం 2.6లక్షలుగా ఉన్న మోసాల సంఖ్య 2025 నాటికి 28 లక్షలకు చేరుకుంది. ఈ మోసాల వల్ల చేజారిన మొత్తం అక్షరాల 22, 931 కోట్లు.
ఈ పరిస్థితుల్లో కేవలం సాంకేతిక భద్రత మాత్రమే సరిపోదని, వినియోగదారులకు రక్షణ కల్పించేలా లావాదేవీలు రూపకల్పనలోనే మార్పులు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.
ఏంటీ కూలింగ్ ఆఫ్ పీరియడ్?
ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం ఒక వ్యక్తి మరొకరికి పదివేల లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని పంపినప్పుడు ఆ నగదు తక్షణమే అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లదు. లావాదేవీల ప్రారంభించిన తర్వాత ఒక గంటపాటు నగదు హోల్డ్ ఉంటుంది. పంపేవారి ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్టు కనిపిస్తుంది. గానీ అది అవతలి వ్యక్తికి చేరదు. ఈ గంట సమయంలో వినియోగదారుడు తాను పొరపాటున లేదా ఎవరికైనా మోసపోయి డబ్బు పంపుతున్నాని గుర్తిస్తే, ఆ లావాదేవీని రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఈ నియమం యూపీఐ, ఐఎంపీఎస్ వంటి తక్షణ చెల్లింపుల వ్యవస్థలన్నింటికీ వర్తింపజేయాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?
సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం సోషల్ ఇంజినీరింగ్ అనే పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు. అంటే బాధితులను భయపెట్టడం ద్వారా తక్షణమే డబ్బులు పంపేలా ఒత్తిడి చేస్తారు. వేగమే ఇక్కడ నేరగాళ్లకు ప్రధాన ఆయుధంగా మారింది. నిందితులు సృష్టించే కృత్రిమ అత్యవసర పరిస్థితి నుంచి వినియోగదారుడు బయటపడి, ఆలోచించడానికి ఒక గంట సమయం ఉపయోగపడుతుంది. మొత్తం మోసాల్లో పదివేల రూపాయల పైన జరిగే లావాదేవీలే 98.5 శాతం విలువను కలిగి ఉన్నాయి. అందుకే ఈ పరిమితిన ప్రామాణికంగా తీసుకున్నారు.
కిల్ స్విచ్, ట్రస్టెడ్ పర్శన్
కేవలం టైమ్ గ్యాప్ మాత్రమే కాకుండా ఆర్బీఐ మరికొన్ని కీలక ప్రతిపాదనలు కూడా చేసింది.

కిల్ స్విచ్:- మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం జరుగుతుందని భావిస్తే, తక్షణమే అన్ని రకాల డిజిటల్ చెల్లింపులను నిలిపివేసేలా ఒక కిల్ స్విచ్ సదుపాయం కల్పించనున్నారు.
వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ: యాభైవేల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే సీనియర్ సిటిజన్లు లేదా టెక్నాలజీపై అవగాహన తక్కువ ఉన్న వ్యక్తుల కోసం ట్రెస్టెడ్ పర్శన్ ఆమోదం తప్పని సరి చేసే అవకాశం ఉంది. అంటే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు లేదా నమ్మకస్తుడైన వ్యక్తి ఆమోదిస్తేనే లావాదేవీ పూర్తి అవుతుంది.
ఎప్పుడు అమలులోకి వస్తుంది? ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ఈ అంశంపై స్టేక్ హోల్డర్లు, బ్యాంకులు, సాధారణ ప్రజల నుంచి మే 8 వరకు అభిప్రాయాలను ఆర్బీఐ కోరింది.ఆ తర్వాత తుది మార్గదర్శకాలను జారీ చేయనుంది.





