విశాఖపట్నం సిటీ పోలీస్ విభాగానికి రిపోర్ట్ చేసిన 161 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 45 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ (టెంపుల్ ఆఫ్ లెర్నింగ్)లో ప్రారంభించారు. వీరిలో 108 మంది పురుషులు, 53 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్టాలపై అవగాహన, పోలీస్ స్టేషన్లలో విధుల నిర్వహణ, ప్రజలతో వ్యవహరించే విధానాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ నూతన కానిస్టేబుళ్లు నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని, బాధితులతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అవినీతికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, సిబ్బంది సమస్యలను ఆధారాలతో తెలియజేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
