నిజామాబాద్, అక్టోబర్ 7:
వినాయక్ నగర్లోని బస్వా గార్డెన్లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ను ఘనంగా నిర్వహించారు. క్యూరోగి, పూమ్సే విభాగాలతో పాటు వివిధ వయస్సు, బరువు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. యూనివర్సల్ టైక్వాండో అకాడమీ, వారియర్స్ అకాడమీ, ఛాంపియన్స్ టైక్వాండో అకాడమీ, అమేజింగ్ టైక్వాండో అకాడమీ తదితర సంస్థలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో 100 మందికి పైగా క్రీడాకారులు పతకాలు సాధించినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేసీ మనోజ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణకు గుర్తింపు తీసుకురావాలని అన్నారు.
టైక్వాండో సాధనతో శారీరక దృఢత్వం, చురుకుదనం, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. పోటీల్లో విజయం సాధించిన వారితో పాటు ఎల్లో బెల్ట్ విభాగంలో విజయం సాధించలేకపోయిన వారు కూడా నిరుత్సాహపడకుండా, ఓటమిని అనుభవంగా తీసుకుని మరింత కష్టపడి తదుపరి పోటీల్లో గెలుపొందాలని సూచించారు.
తమ పిల్లలను ప్రోత్సహిస్తూ నిరంతరం శిక్షణకు పంపిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్న కోచ్ జేసీ మనోజ్ కుమార్ను అభినందించారు. కోచ్లు గంగాధర్, నాగరాజ్, శివకుమార్, వినయ్ తదితరులను సత్కరిస్తూ భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులను టైక్వాండో వైపు ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. ఈ క్రీడ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యంపై అవగాహన, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని పేర్కొన్నారు.
జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి మరిన్ని పతకాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
