పటాన్చెరు పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీ రాయల్ ఎన్ఆర్ఐ సిటీ కాలనీలో పార్కు, పబ్లిక్ ఓపెన్ స్పేస్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ రాయల్ ఎన్ఆర్ఐ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్లు 164, 166, 167, 168, 169, 170, 171, 172, 173లో పార్కు కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఆమోదిత లేఅవుట్లో పార్కు స్థలం స్పష్టంగా ఉన్నప్పటికీ, కొందరు వ్యక్తులు సరైన హక్కు పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు లేకుండా స్థలాన్ని విక్రయిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఆమోదిత లేఅవుట్, మున్సిపల్ రికార్డులను పరిశీలించి నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు స్థలాన్ని పరిరక్షించి ప్రజల వినియోగానికి పార్కుగా అభివృద్ధి చేయాలని వారు కోరారు.

