
- ఘనంగా కప్పర జన్మదిన వేడుకలు.. ప్రశంసించిన హర్యానా మాజీ గవర్నర్ దత్తాత్రేయ
తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు జన్మదిన వేడుకలు మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై కప్పర ప్రసాద్ రావును శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టుగా కప్పర ప్రసాద్ రావు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, ప్రజలకు తనవంతు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. జర్నలిజంలో నైతిక విలువలను పాటిస్తూ నిబద్ధతతో కొనసాగడం అందరికీ సాధ్యం కాదని, అయితే కప్పర ప్రసాద్ రావు విలువలకు కట్టుబడి పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ముందుండాలని దత్తాత్రేయ సూచించారు. గజ్వేల్ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తే వారి ఆశీర్వాదాలు తప్పక లభిస్తాయని అన్నారు. ప్రజా పోరాటాల్లో కప్పర ప్రసాద్ రావు జీవితం ఒక భాగంగా మారిందని పేర్కొన్నారు. గజ్వేల్ బిడ్డగా కప్పర ప్రసాద్ రావును తాను ఎల్లప్పుడూ ఆదరిస్తానని బండారు దత్తాత్రేయ పేర్కోన్నారు. భవిష్యత్లో ఆయనకు మరిన్ని మంచి అవకాశాలు, ఉన్నతమైన హోదాలు లభించాలని ఆకాంక్షించారు. తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కప్పర ప్రసాద్ రావు తన కుటుంబ సభ్యుడి వంటివారని ఆప్యాయత వ్యక్తం చేశారు.
నైతిక విలువలతో జీవిస్తూ ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులకు ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, చివరకు సమాజంలో వారికి ఉన్నతమైన గౌరవం, మంచి గుర్తింపు లభిస్తుందని దత్తాత్రేయ అన్నారు. కప్పర ప్రసాద్ రావు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ రావుకు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మేధావులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ములుగు మాజీ జెడ్పీటీసీ సింగం సత్తయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ifwj జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జునయ్య, ifwj జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహా, ifwj జాతీయ కార్యదర్శి డాక్టర్. ఎస్. భరత్ కుమార్ శర్మ, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, జిల్లా అధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తూర్పుంటి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షులు భూపతి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు శేఖర్ గుప్తా, కార్యదర్శి ఎల్లంరాజు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ చారి, రాష్ట్ర, జిల్లా నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.



