-
రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు
-
రాయపట్నం, రాజారాంపల్లె, చిల్వకోడూర్ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
-
ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
జగిత్యాల, మే 16 : రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు భద్రంగా కొనసాగేందుకు, పశువుల అక్రమ రవాణా మరియు గోవధ నివారణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ (IPS) తెలిపారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోందని, ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ నిఘా చర్యల్లో భాగంగా జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన రాయపట్నం, రాజారాంపల్లె, చిల్వకోడూర్ చెక్‌పోస్టులను ఎస్పీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి
జిల్లా సరిహద్దుల గుండా ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా పశువులను తరలిస్తున్న వాహనాల రవాణా పత్రాలను (పర్మిట్లు) పూర్తిగా పరిశీలించాలని, అనుమానం వస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను విధిగా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. పశువులను అక్రమంగా తరలించే వాహనాల తనిఖీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని, రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించం
అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారనే నెపంతో కొందరు వ్యక్తులు లేదా నిర్దిష్ట సంఘాలు బృందాలుగా ఏర్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, వాహనాలపై దాడులు చేసి అల్లర్లు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. “చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా పోలీసు శాఖదే. ఎవరూ స్వచ్ఛందంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు” అని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని ఎస్పీ తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి, తమ పరిసరాల్లో ఏదైనా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ధర్మపురి సీఐ రామ్ నరసింహ రెడ్డి, ఎస్ఐలు మహేష్, ఉదయ్ కుమార్, కృష్ణ సాగర్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

