-
స్టేషన్కు రాలేని వారి వద్దకే వచ్చి సాయం అందిస్తాం
-
సమస్యలు ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
ధర్పల్లి, మే 14
: వికలాంగులు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధర్పల్లి ఎస్సై ఎల్. రామ్ భరోసా ఇచ్చారు. ధర్పల్లి మండలంలోని మోబిన్ సబ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎస్సై రామ్ మాట్లాడుతూ.. శారీరక ఇబ్బందుల కారణంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయే వికలాంగుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామని తెలిపారు. అటువంటి వారు సమాచారం అందిస్తే, తామే నేరుగా వారి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకుని అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
వికలాంగులు తమకు ఎదురయ్యే ఇబ్బందులను లేదా అన్యాయాలను ఏమాత్రం సంకోచించకుండా, నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. వారి నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో స్వీకరించి, తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమాజంలో వికలాంగులకు సముచిత గౌరవం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు మరియు స్థానిక వికలాంగులు పాల్గొన్నారు.

