-
13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా మహిళా డంపర్ ఆపరేటర్ల నియామకం
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో నిర్ణయం
-
విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 13 మంది మహిళా ఉద్యోగులు
సింగరేణి భవన్ (హైదరాబాద్), మే 14: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 130 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయం మొదలుకానుంది. ఇప్పటివరకు పురుషులకే పరిమితమైన భారీ డంపర్ ఆపరేటర్ వృత్తిలోకి మహిళలు అడుగుపెట్టబోతున్నారు. మహిళా శక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఓపెన్ కాస్ట్ గనుల్లో 60 నుండి 100 టన్నుల భారీ డంపర్లను నడిపే బాధ్యతలను మహిళలకు అప్పగించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.
మహిళా సాధికారతకు బాటలు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖామాత్యులు భట్టి విక్రమార్క మల్లు మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించారు. కష్టతరమైన బాధ్యతల్లోనూ మహిళలకు అవకాశం కల్పించాలన్న వారి ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో తీవ్రమైన ఎండ, వాన, చలి పరిస్థితుల్లో మూడు షిఫ్టుల్లో డంపర్లను నడపడం శారీరక దృఢత్వంతో కూడుకున్న పని. గత 50 ఏళ్లుగా ఈ పనులను పురుషులు మాత్రమే నిర్వహిస్తుండగా, ఇప్పుడు మహిళలు ఆ రికార్డును తిరగరాయబోతున్నారు.
శిక్షణ పూర్తి.. విధులకు సిద్ధం
ఈ సవాల్‌తో కూడిన వృత్తిపై ఆసక్తి చూపిన 35 మంది మహిళా ఉద్యోగుల్లో, అర్హులైన వారికి సిరిసిల్లలోని ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్’ (TIDES) ద్వారా కంపెనీ ఖర్చుతోనే ఉచిత హెవీ మోటార్ వెహికల్ శిక్షణ అందించారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 13 మంది మహిళలు ప్రస్తుతం డంపర్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో జారీ కానున్న నియామక ఉత్తర్వుల ద్వారా వీరు విధుల్లో చేరనున్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు
“ఆధునిక కాలంలో మహిళలు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు, గనిలో డంపర్లను నడపడం మాకు అసాధ్యమేమీ కాదు” అని శిక్షణ పొందిన మహిళా ఆపరేటర్లు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
అన్ని విభాగాల్లోనూ మహిళా శక్తి
ఈ సందర్భంగా సింగరేణి అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటికే బెల్లంపల్లి ఖైరీగూడ గనిలో క్లిష్టమైన బ్లాస్టింగ్ విభాగంలోనూ, సంస్థ చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ జట్టును కూడా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని క్లిష్టతరమైన బాధ్యతల్లో మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
– చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, సింగరేణి కాలరీస్


