-
మే 20 నుండి నెల రోజుల పాటు ‘జెండా పండుగ’
-
గ్రామస్థాయి వరకు కమిటీల నియామకం: జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్
-
కవితమ్మ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పోరాటం
కరీంనగర్, మే 14
: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీని కరీంనగర్ జిల్లాలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యచరణపై పలు కీలక తీర్మానాలు చేశారు.
వాడవాడనా జెండా పండుగ
రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ పిలుపు మేరకు మే 20 నుండి జూన్ 20 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ‘జెండా పండుగ’ను ఉత్సవంలా నిర్వహించాలని హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలోనే జిల్లా, మండల మరియు గ్రామ స్థాయిల్లో పటిష్టమైన కమిటీలను వేయనున్నట్లు వెల్లడించారు.
పాంచజన్య సిద్ధాంతాలతో ముందుకు..
పార్టీ ఆవిర్భావ సభలో కవితమ్మ ప్రకటించిన ‘పాంచజన్య సిద్ధాంతాలను’ ఇంటింటికీ చేరవేస్తామని హరిప్రసాద్ తెలిపారు. తెలంగాణ రక్షణ సేన ద్వారానే రాష్ట్ర ప్రజల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కవితమ్మ నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకొని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల కంటే దీటుగా టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన)ను నిర్మిస్తామన్నారు.
ప్రజా సమస్యలపై పోరాట తీర్మానం
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద నిరంతరం పోరాటం చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితుల పక్షాన నిలబడి, ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు.
పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లింగంపల్లి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, చంటి శ్రీనివాస్, కొత్తపల్లి తిరుపతి, ఎండి హుస్సేన్, ఎండి బషీర్ తదితరులు పాల్గొన్నారు.

