-
మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో వినతి
-
రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ ఇంచార్జి
హయత్నగర్, మే 14 
: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని శివారు కాలనీల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బి.ఎన్.రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్, యువ నాయకులు ముద్దగౌని మనీష్ గౌడ్.. మాజీ ఎంపీ, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. హయత్నగర్ టి.నగర్ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ సమావేశం జరిగింది.
ప్రజల ఇబ్బందులపై చర్చ
ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ.. సాహెబ్ నగర్ డివిజన్ పరిధిలోని పలు శివారు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధు యాస్కి గౌడ్ దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కాలనీల్లో కనీసం గ్రావెల్ రోడ్లు వేయించాలని, శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ నిధులు మంజూరు చేయించాలని ఆమె విన్నవించారు.
నిధుల మంజూరుకు హామీ
కాలనీవాసుల సమస్యలపై మధు యాస్కి గౌడ్ సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారులతో మాట్లాడి శివారు కాలనీల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

