-
మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ తీరని ద్రోహం
-
తెలంగాణలో ఎంపీ సీట్లు 26కు పెరిగే అవకాశాన్ని తుంచేశారు
-
బీజేపీ నేతలు గోపిడి శ్రవంతి రెడ్డి, రితేష్ రాథోడ్, రాజు ముదిరాజ్ ధ్వజమెత్తం
నిర్మల్, ఏప్రిల్ 30
: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చట్ట సవరణలను కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు కుట్రపూరితంగా అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లా ఇంచార్జి గోపిడి శ్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, స్టేట్ మీడియా ప్యానలిస్ట్ బొమ్మరాగోని రాజు ముదిరాజ్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మహిళా విరోధిగా కాంగ్రెస్ చరిత్ర
మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్కు ఇది ఏడోసారి అని వారు విమర్శించారు. 1996 నుండి నేటి వరకు ఏదో ఒక వంకతో ఈ బిల్లును అడ్డుకుంటూ మహిళా లోకానికి ఆ పార్టీ ద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు. “మేం గిల్లినట్లు చేస్తాం, మీరు ఏడ్చినట్లు చేయండి” అన్న చందంగా కాంగ్రెస్ తన మిత్రపక్షాలను ఉసిగొల్పి చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని అణచివేస్తోందని ఆరోపించారు.
దక్షిణాదికి తీరని నష్టం
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుందని వారు పేర్కొన్నారు.
-
సీట్ల పెంపు: ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే తెలంగాణలో లోక్సభ సీట్లు 17 నుండి 26కు, ఆంధ్రప్రదేశ్లో 25 నుండి 38కి పెరిగే అవకాశం ఉండేదని వివరించారు.
-
ద్వంద్వ వైఖరి: బిల్లు రాకముందు దక్షిణాదికి అన్యాయం అంటారని, బిల్లు తెస్తే కుట్ర అంటారని.. కాంగ్రెస్ నేతల తీరు అర్థం లేనిదని ఎద్దేవా చేశారు. 30 కోట్ల దక్షిణాది ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ కాలరాసిందని విమర్శించారు.
రాహుల్ గాంధీ విధానాలు దేశ వ్యతిరేకం
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఉండాల్సింది పోయి, దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటి సైనిక చర్యలను అవమానించడం 140 కోట్ల భారతీయులను అవమానించడమేనన్నారు. బీసీలకు, మహిళలకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వని కాంగ్రెస్కు సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
మహిళా లోకం బుద్ధి చెబుతుంది
ఈ బిల్లుల వీగిపోవడం బీజేపీ ఓటమి కాదని, ఇది 70 కోట్ల భారత మహిళల ఓటమి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని వివరిస్తామని, మహిళలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం దక్షిణాదికి సమన్యాయం చేస్తుందని, ఇందులో భాగంగానే 7 ఎలివేటెడ్ రైల్వే కారిడార్లలో 3 తెలంగాణకు కేటాయించామని గుర్తు చేశారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం మౌనిక, కౌన్సిలర్లు రావుల రమ్య, బొబ్బరపు సత్యవతి, సర్పంచ్ సిరం సుస్మా రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకురాలు తిరుమల కల్పనా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

