-
ఉత్పత్తి లక్ష్య సాధనలో సంఘాల పాత్ర కీలకం
-
సంక్షేమానికి సింగరేణి పెద్దపీట: జీఎం రాధాకృష్ణ
మందమర్రి, ఏప్రిల్ 30
: సింగరేణి సంస్థ అభివృద్ధిలో మరియు ఉత్పత్తి ఉత్పాదకతలో కార్మిక సంఘాల పాత్ర అత్యంత కీలకమని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ N. రాధాకృష్ణ పేర్కొన్నారు. బుధవారం మందమర్రి జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) నాయకులతో 17వ నిర్మాణాత్మక (స్ట్రక్చర్) సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.
కార్మిక సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని ఆయన సమీక్షించారు. ప్రస్తుత సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను సానుకూలంగా స్పందించిన జీఎం, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో సహకరించిన విధంగానే భవిష్యత్తులో కూడా కార్మిక శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.
సమస్యలపై నాయకుల గళం
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్ ఏరియాల్లోని కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. పని స్థలాల్లో సౌకర్యాలు, క్వార్టర్ల మరమ్మతులు మరియు ఇతర పరిపాలనాపరమైన అంశాలపై చర్చించారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ పాల్గొన్నారు. అధికారుల తరపున ఎస్.కె. గ్రూప్ ఏజెంట్ అబ్దుల్ ఖాదీర్, డీజీఎం (పర్సనల్) అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, ఏరియా ఇంజనీర్ బాలాజీ భగవతి జా, ఏరియా స్టోర్స్ డీజీఎం సురేష్, వర్క్‌షాప్ డీజీఎం దూప్ సింగ్, డీవైపీఎం సందీప్, సివిల్ ఎస్.ఈ. శ్రీధర్, సెక్యూరిటీ ఆఫీసర్ రవి మరియు ఏఐటీయూసీ నాయకులు కంది శ్రీనివాస్, సి.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.

