-
అరకొర నిల్వలతో ‘నో స్టాక్’ బోర్డులు
-
గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్న ప్రజలు
షాబాద్, ఏప్రిల్ 28
: మండల కేంద్రమైన షాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. గత రెండు రోజులుగా ఇంధన సరఫరాలో అంతరాయం కలగడంతో స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. మంగళవారం ఉదయం నుంచే పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
స్తంభించిన రవాణా.. అవస్థల్లో వాహనదారులు
ఇంధన కొరత కారణంగా అత్యవసర పనుల మీద వెళ్లే వారు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎండలో వేచి ఉన్నా స్టాక్ అయిపోయిందని చెప్పడంతో చాలామంది వాహనదారులు తమ వాహనాలను తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. “ఉదయం నుంచి వేచి ఉన్నా పెట్రోల్ దొరకలేదు, దీనివల్ల మా పనులన్నీ ఆగిపోయాయి” అని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి
మండల వ్యాప్తంగా నెలకొన్న ఈ ఇంధన సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని, ఇంధన సరఫరాను త్వరగా పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. ఇంధన కొరత వల్ల వ్యవసాయ పనులకు వెళ్లే ట్రాక్టర్లు, నిత్యావసర రవాణాపై కూడా ప్రభావం పడుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




