-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మాస్టర్ ప్లాన్’ పరిశీలన
-
2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ఆలయాల సుందరీకరణ
-
గత పాలకులు ధర్మపురి క్షేత్రాన్ని విస్మరించారు: మంత్రి విమర్శ
ధర్మపురి, ఏప్రిల్ 28
: గత ప్రభుత్వాల హయాంలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం అందరి సహకారంతో ఈ క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, వైదిక సలహాదారు గోవిందుల హరితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పుష్కరాల లోపు క్షేత్రం రూపురేఖలు మార్చుతాం
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గోదావరి తీరం వెంబడి ఉన్న ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారని తెలిపారు. ఇందులో భాగంగానే భద్రాచలం, బాసర, కాళేశ్వరం, వేములవాడ క్షేత్రాలతో పాటు ధర్మపురి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
టెంపుల్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు
ధర్మపురిలో మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు ‘టెంపుల్ సిటీ’ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. “ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. నివేదిక అందిన వెంటనే నిధుల కేటాయింపు, పనుల ప్రారంభం జరుగుతుంది” అని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే భద్రాచలంలో టెంపుల్ సిటీ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రజల సహకారం అత్యవసరం
ధర్మపురి క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా తీర్చిదిద్దే క్రమంలో స్థానిక ప్రజల సహకారం ఎంతో అవసరమని మంత్రి కోరారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు మరియు భక్తుల భాగస్వామ్యంతో మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.




