-
మానవ ఐక్యత దినోత్సవం సందర్భంగా నిరంకారి భక్తుల ఉదారత
-
సద్గురు బాబా గురు బచన్ సింగ్ జ్ఞాపకార్థం రక్తదానం
కరీంనగర్, ఏప్రిల్ 27 
: సద్గురు నిరంకారి ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మానవ ఐక్యత దినోత్సవం’ (ఏప్రిల్ 24) పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆదివారం భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యుగ ప్రవర్తక్ బాబా గురు బచన్ సింగ్ జీ త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రక్తదానమే గొప్ప సేవ
శిబిరానికి హాజరైన నిరంకారి భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. “రక్తం నాళాల్లో ప్రవహించి ప్రాణాలను నిలపాలి కానీ, హింసతో కాలువల్లో పారకూడదు” అనే బాబా సందేశాన్ని చాటిచెప్పారు. 1986 నుండి ప్రతి సంవత్సరం భారతదేశం మరియు విదేశాలలో ఈ సేవ సంస్థ ద్వారా లక్షలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రాణాపాయంలో ఉన్నవారికి అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
పాల్గొన్న వైద్యాధికారులు
ఈ కార్యక్రమానికి కరీంనగర్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ నవీన, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఉషారాణి హాజరై రక్తదాతలను అభినందించారు. సేవా దృక్పథంతో నిరంకారి భక్తులు చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరమని వారు కొనియాడారు.
ముఖ్య అతిథులు
ఈ శిబిరంలో హైదరాబాద్ జ్ఞాన ప్రచారకులు ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ సెక్టార్ సంయోజక్ ఇన్చార్జి వాసాల శ్రీకాంత్, సంచాలక్ వేణు మరియు పెద్ద సంఖ్యలో నిరంకారి భక్తులు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. పవిత్రమైన ఈ ఆశయంతో నిర్వహించిన ఈ శిబిరం విజయవంతంగా ముగిసింది.




