-
అటవీ ప్రాంతంలోని నీటి గుంటల భర్తీ
-
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
-
సర్పంచ్ రాజేందర్, అటవీ శాఖ సిబ్బంది చొరవ
ధర్పల్లి, ఏప్రిల్ 23: ధర్పల్లి మండలంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, అడవిలోని వన్యప్రాణుల ప్రాణాలను కాపాడేందుకు రేకులపల్లి గ్రామ పంచాయతీ అభినందనీయమైన నిర్ణయం తీసుకుంది. వేసవి తాపానికి అటవీ ప్రాంతంలోని నీటి వనరులు ఎండిపోవడంతో, వన్యప్రాణులు నీరు దొరకక అల్లాడకుండా గ్రామ సర్పంచ్ రాజేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
రేకులపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న చోట ఏర్పాటు చేసిన నీటి గుంటలను (Saucer Pits) పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నింపారు. నీరు లేక మూగజీవాలు మృతి చెందకూడదనే ఉద్దేశంతో అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వెల్లువెత్తుతున్న అభినందనలు
తీవ్రమైన ఎండల్లో అటవీ జీవుల పట్ల మానవత్వం చాటుకున్న గ్రామ పంచాయతీ తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఎండలు తగ్గే వరకు నిరంతరం అడవిలోని నీటి గుంటలను పర్యవేక్షిస్తూ నీటిని నింపుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




