-
తిమ్మాపూర్, గొల్లమాడ గ్రామాల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ
-
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
-
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నర్సాపూర్ (ముధోల్), ఏప్రిల్ 22: నియోజకవర్గంలోని గ్రామాలను దశలవారీగా అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే తన ప్రధాన ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండలంలోని తిమ్మాపూర్, గొల్లమాడ గ్రామాల్లో సుమారు రూ. 1.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేసి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
తిమ్మాపూర్లో రూ. 90 లక్షల పనులు
తిమ్మాపూర్ గ్రామంలో రూ. 90 లక్షల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల ప్రహరీ గోడ, మరియు మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా, వైద్యం, సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
28 ప్యాకేజీతో 13 వేల ఎకరాలకు సాగునీరు
గొల్లమాడ గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో చెరువు మరమ్మత్తు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో తాను నిరంతరం గళమెత్తడం వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని, 28 ప్యాకేజీ పనులు పూర్తయితే కుంటాల, నర్సాపూర్ మండలాల్లోని 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అభివృద్ధిలో సరికొత్త రికార్డులు:
-
బాసర ఆలయం: గత పదేళ్లలో లేని విధంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి రూ. 25 కోట్లు మంజూరు చేయించామని, ఆలయ పునర్నిర్మాణం తన హయాంలో జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు.
-
విద్యా రంగం: ముధోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రూ. 220 కోట్ల భారీ నిధులు మంజూరు కావడం శుభపరిణామన్నారు.
-
రైతు సంక్షేమం: వ్యాపారుల దోపిడీని అరికట్టి రైతులకు మద్దతు ధర కల్పించేందుకే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
త్వరలోనే తిమ్మాపూర్ గ్రామానికి బైపాస్ రోడ్డు, గొల్లమాడ చెరువు కాలువ లైనింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు, మండల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




