-
రూ. 12 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ
-
ఇప్పటివరకు జిల్లాలో రూ. 2.56 కోట్ల విలువైన ఫోన్ల అప్పగింత
-
CEIR పోర్టల్‌పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి: ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్
నిర్మల్, ఏప్రిల్ 21 (ప్రజా సాక్షి): మొబైల్ ఫోన్ల దొంగతనాలు మరియు అదృశ్యమైన కేసులపై నిర్మల్ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు మరో 100 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు వీటిని ఎస్పీ స్వయంగా అందజేశారు.
రికార్డు స్థాయిలో రికవరీ
తాజాగా రికవరీ చేసిన 100 ఫోన్ల విలువ సుమారు రూ. 12 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,135 ఫోన్లను రికవరీ చేశామని, వీటి మొత్తం విలువ సుమారు రూ. 2,56,20,000 (రెండు కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు) అని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో నిర్మల్ పోలీసులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
CEIR పోర్టల్ ఎంతో కీలకం
మొబైల్ పోగొట్టుకున్న వారు ఆందోళన చెందకుండా వెంటనే www.ceir.gov.in వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
-
సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చే ఐడీతో CEIR లో రిజిస్టర్ చేసుకోవాలి.
-
దీనివల్ల ఫోన్ ఎక్కడున్నా సులభంగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
-
ఫోన్ పోగొట్టుకోవడం వ్యక్తిగత భద్రతకే కాకుండా సామాజిక భద్రతకు కూడా భంగం కలిగిస్తుందని, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పై నిఘా
సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. తక్కువ ధరకు వస్తున్నాయని చోరీ ఫోన్లను కొంటే చిక్కుల్లో పడతారని తెలిపారు. ఒకే వ్యక్తి వద్ద పెద్ద సంఖ్యలో ఫోన్లు కనిపిస్తే వారు ఏదైనా చోరీ ముఠాలో సభ్యులేమోనన్న కోణంలో సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
తమ పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందిన బాధితులు ఎస్పీకి మరియు ఐటీ కోర్ పోలీసు బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన ఐటీ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.




