-
ఐదు తండాల్లో ప్లాస్టిక్ వినియోగంపై పూర్తి నిషేధం

-
జగదాంబ ఆలయానికి 300 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేత
ధర్పల్లి, ఏప్రిల్ 18 (ప్రజా సాక్షి): పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం నడిమితండా గ్రామపంచాయతీ ఒక ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ పరిధిలోని ఐదు తండాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఆరోగ్యమే మహాభాగ్యం: సర్పంచ్ కేలు
ఈ సందర్భంగా సర్పంచ్ కేలు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం కలుషితం కావడమే కాకుండా, ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఆలయంలో ప్లాస్టిక్ రహిత అన్నదానం
ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని జగదాంబ ఆలయానికి గ్రామపంచాయతీ తరపున సుమారు 300 స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందజేశారు. ఇకపై ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ విస్తరాకులు, గ్లాసులకు బదులుగా స్టీల్ పాత్రలనే వినియోగించాలని భక్తులకు, ఆలయ కమిటీకి విజ్ఞప్తి చేశారు.
హాజరైన ఐదు తండాల ప్రజలు
ఈ కార్యక్రమంలో నడిమితండా, బీరప్ప తండా, కుంట తండా, బలరాం తండా, లక్ష్మి చిరుతాండ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటు ఉప సర్పంచ్ సతీష్ నాయక్, గ్రామ కార్యదర్శి సుమన్, విడిసి చైర్మన్ బాలు నాయక్, పూజారి బలరాం నాయక్, భుక్య లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, బాణావత్ శంకర్ నాయక్, లింబియా నాయక్, మునియా నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొని ప్లాస్టిక్ నిషేధానికి మద్దతు ప్రకటించారు.




