-
ఎల్సీ (LC) తీసుకున్నానని అబద్ధం చెప్పిన లైన్మెన్.. నమ్మి పైకెళ్లిన నగేష్ ముదిరాజ్
-
స్తంభంపైనే షాక్ తగిలి కిందపడటంతో తీవ్ర గాయాలు.. ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌కు తరలింపు
-
రూ. 200 ఇచ్చి ప్రైవేటు వ్యక్తులతో పనులు.. అధికారుల తీరుపై గ్రామస్థుల తీవ్ర ఆగ్రహం
ధర్పల్లి/నిజామాబాద్, మే 22 :
విద్యుత్ శాఖ అధికారుల బాధ్యతారాహిత్యం, లైన్మెన్ల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా ఒక సామాన్య గ్రామీణ యువకుడి ప్రాణం గాల్లో దీపంగా మారింది. ధర్పల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లైన్మెన్ చేయాల్సిన ప్రమాదకరమైన పనిని, ఎలాంటి అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తితో చేయించడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది.
అసలేం జరిగిందంటే..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హఠాత్తుగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీనిపై గ్రామ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న లైన్మెన్కు స్థానికులు ఫోన్ చేశారు. ఆ సమయంలో లైన్మెన్ క్షేత్రస్థాయికి రాకుండా, గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన నగేష్ అనే యువకుడికి ఫోన్ చేసి.. “నేను సబ్‌స్టేషన్ నుండి ఎల్సీ (Line Clearance) తీసుకున్నాను, నువ్వు వెళ్లి స్తంభం ఎక్కి వైర్లు సరిచేయ్” అని పురమాయించాడు.
లైన్మెన్ మాటలను పూర్తిగా నమ్మిన నగేష్.. విద్యుత్ సరఫరా ఆగిపోయిందనే ధీమాతో కరెంట్ స్తంభం పైకి ఎక్కాడు. అయితే, అప్పటికే లైన్ క్లియరెన్స్ తీసుకోకపోవడంతో స్తంభంపై నగేష్‌కు ఒక్కసారిగా హైవోల్టేజ్ కరెంట్ షాక్ తగిలింది. దీంతో గాల్లోంచి ఒక్కసారిగా కిందపడటంతో నగేష్‌కు తల, శరీర భాగాలపై తీవ్రమైన గాయాలయ్యాయి.
ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌కు..
రక్తపు మడుగులో స్పృహతప్పి పడిపోయిన నగేష్‌ను గ్రామస్థులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాత్రి అంతా పరీక్షించిన వైద్యులు, నగేష్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, తక్షణమే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించడంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఆయన్ను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నగేష్ ప్రాణాపాయ స్థితిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
రూ. 200 లంచం.. ప్రాణాలతో చెలగాటం!
ఈ ఘటనపై గోవిందపల్లి గ్రామస్థులు, ప్రజాసంఘాల నాయకులు విద్యుత్ శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా ప్రభుత్వ నిధుల నుండి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న లైన్మెన్లు క్షేత్రస్థాయిలో తాము స్వయంగా పని చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో రోజువారీగా రూ. 200 – 300 ఇస్తూ, డిపార్ట్మెంట్తో ఎలాంటి సంబంధం లేని, కనీస అనుభవం లేని అమాయక యువకులను స్తంభాలు ఎక్కిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి నిర్లక్ష్యపు ఘటనల వల్లే ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు దిక్కుమొక్కులేనివిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యత ఎవరిది? డిమాండ్లు ఇవే:
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తమవుతోంది.
-
నగేష్ కుటుంబానికి దిక్కెవరు?: ఈ ఘోర ప్రమాదానికి స్థానిక విద్యుత్ శాఖ ఏఈ (AE), సదరు లైన్మెన్ పూర్తి బాధ్యత వహించాలి.
-
వైద్య ఖర్చులు భరించాలి: హైదరాబాద్ ఆసుపత్రిలో నగేష్‌కు అవుతున్న వైద్య ఖర్చులను పూర్తిగా విద్యుత్ శాఖే భరించి, ఆ కుటుంబానికి భారీ నష్టపరిహారం చెల్లించాలి.
-
కఠిన చర్యలు తీసుకోవాలి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, ప్రైవేట్ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చిన లైన్మెన్ను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ నగేష్ కుటుంబానికి మద్దతుగా నిలవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు విద్యుత్ కార్యాలయం ముందు ఆందోళనలు ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.


