-
కాంట్రాక్టర్లను ఆదేశించి పెండింగ్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
-
బాంబే కాలనీ కమ్యూనిటీ హాల్ అద్దె తగ్గించాలి
-
రైతు బజార్ దుకాణాల కేటాయింపు, ఎంఎంటీఎస్ హాల్ట్ బీటీ రోడ్డు పనులు తక్షణమే ప్రారంభించాలి
పటాన్చెరు/భారతీనగర్, మే 20
:
“భారతీనగర్ డివిజన్ పరిధిలో గతంలో మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన పలు ప్రధాన అభివృద్ధి పనులను రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన పూర్తి చేయాలి” అని డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి జీహెచ్ఎంసీ (GHMC) ఉన్నతాధికారులను కోరారు. బుధవారం ఆమె మున్సిపల్ జోనల్ కమిషనర్ (ZC) నారాయణ అమిత్ ను మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రధానాంశాలు:
కమ్యూనిటీ హాల్ అద్దె సామాన్యులకు భారం..
బాంబే కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ అద్దెను ప్రస్తుతం అధికారులు రూ. 15,000లుగా నిర్ణయించారని, ఆ ప్రాంతం అంతా పేదలు నివసించే మురికివాడ (స్లమ్ ఏరియా) కావడంతో అంత పెద్ద మొత్తంలో అద్దె చెల్లించడం సామాన్యులకు భారంగా మారిందని జేసీకి వివరించారు. పేద ప్రజల శుభకార్యాలకు అందుబాటులో ఉండేలా ఈ అద్దెను కనీస స్థాయికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
రైతు బజార్ ప్రారంభం, బీటీ రోడ్డు నిర్మాణాలు
బాంబే కాలనీ రైతు బజార్‌కు సంబంధించిన అధికారిక టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున, తదుపరి అంకమైన దుకాణాల (స్టాళ్ల) కేటాయింపు ప్రక్రియను వెంటనే చేపట్టి, రైతు బజార్‌ను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎం.ఎం.టీ.ఎస్ (MMTS) హాల్ట్ రోడ్ నుంచి అన్నమయ్య ఎన్క్లేవ్ వరకు ప్రతిపాదించిన బీటీ రోడ్డు పనులను కాంట్రాక్టర్ల ద్వారా తక్షణమే ప్రారంభించి ప్రయాణీకుల ఇబ్బందులు తొలగించాలన్నారు.
జేసీ సానుకూల స్పందన
మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తులపై జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ సానుకూలంగా స్పందించారు. డివిజన్ పరిధిలోని పెండింగ్ పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష జరుపుతామని, కాంట్రాక్టర్లను ఆదేశించి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కమ్యూనిటీ హాల్ అద్దె తగ్గింపు, రైతు బజార్ ప్రారంభంపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు సింధు ఆదర్శ్ రెడ్డి విలేకరులకు తెలిపారు.

