-
కేంద్ర గెజెట్ నోటిఫికేషన్‌కు నిరసనగా కలెక్టరేట్ ఎదుట ధర్నా
-
కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ హక్కులను కాలరాస్తున్న మోదీ ప్రభుత్వం
-
మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రత్యేక చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం
-
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ‘టీఎంఎస్‌ఆర్‌యూ’ రాష్ట్ర అధ్యక్షులు చీకోటి శ్రీధర్ పిలుపు
కరీంనగర్, మే 19
:
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మే 8వ తేదీన దేశవ్యాప్తంగా నాలుగు కార్మిక కోడ్లకు సంబంధించిన నిబంధనలను గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏకపక్షంగా ఖరారు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (TMSRU) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి టీఎంఎస్‌ఆర్‌యూ (TMSRU) రాష్ట్ర అధ్యక్షులు చీకోటి శ్రీధర్ ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ యాజమాన్యాలకు ఊడిగం చేస్తూ, దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను బలహీనపరిచేందుకే ఈ నల్ల చట్టాల రూల్స్‌ను తీసుకొచ్చిందని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉద్యోగ భద్రతకు తీవ్ర ముప్పు.. 12 గంటల పనిదినాలా?
కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లడమే కాకుండా, యాజమాన్యాలను ప్రశ్నించే ట్రేడ్ యూనియన్ల పాత్రను తగ్గించేలా నిబంధనలు ఉన్నాయని శ్రీధర్ మండిపడ్డారు. ముఖ్యంగా “ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్” పేరుతో పర్మనెంట్ ఉద్యోగాల సంస్కృతిని పూర్తిగా దెబ్బతీసి, కార్మికులను తీవ్ర అభద్రతాభావంలోకి నెట్టే కుట్ర జరుగుతోందన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా పనిగంటలను 8 గంటల నుండి 12 గంటల వరకు పొడిగించుకునేలా అవకాశం కల్పించడం కార్మిక లోకాన్ని వంచించడమేనని ఆయన దుయ్యబట్టారు.
సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ చట్టాన్ని విలీనం చేయడం దుర్మార్గం
ఈ నల్ల చట్టాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్స్ రంగానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న “సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ 1976” ని ఈ కొత్త కోడ్లలో విలీనం చేయడం దుర్మార్గమన్నారు. దీనివల్ల మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌కు చట్టపరంగా ఉన్న రక్షణలు, ప్రత్యేక సెలవులు, స్థిరమైన పనివేళల నిబంధనల అమలులో అనేక అవరోధాలు ఎదురవుతాయన్నారు. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతూ, యాజమాన్యాల వేధింపులను ఎదుర్కోవాల్సిన దుస్ధితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజీలేని పోరాటాలకు సిద్ధం కండి..
ఎన్నికల్లో గెలవగానే కార్పొరేట్ శక్తుల ఎజెండాను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజీలేని పోరాటం చేస్తామని శ్రీధర్ హెచ్చరించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ 4 కోడ్లను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే “సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ 1976” ద్వారా లభించే రక్షణలను యథావిధిగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్, కార్మిక లోకాన్ని ఏకం చేసి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిరుపాల అంజయ్య, సీఐటీయూ (CITU) జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పూదరి హరీష్, సహ కార్యదర్శి పబ్బ నరేందర్, జిల్లా సహాధ్యక్షుడు అన్నారం బాలకిషన్ మరియు మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

