-
గొల్లపల్లి, జాబితాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
-
లబ్ధిదారులకు కానుకగా చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్, మే 02: పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలంలోని గొల్లపల్లి, జాబితాపూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గృహప్రవేశ వేడుకల్లో సందడి
మొదటగా గొల్లపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఏక్కల్ దేవి తిరుపతి – గంగరాజుల నూతన గృహాన్ని, అనంతరం జాబితాపూర్ గ్రామానికి చెందిన లక్కం జల – విజయ్‌లకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ, సంప్రదాయం ప్రకారం వారికి పట్టుచీరలను కానుకగా అందజేశారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. లబ్ధిదారులు పట్టుదలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం సంతోషకరమని, ఈ ఇళ్లు ఆయా కుటుంబాలకు భద్రతను, గౌరవాన్ని ఇస్తాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరేలా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచ్ ప్రకాష్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కొలుగురి దామోదర్ రావు, నక్కల రాధా రవీందర్ రెడ్డి, మాజీ పాక్స్ చైర్మన్ సదాశివ రావు, ఉపసర్పంచులు మల్లేశం, సత్తిరెడ్డి సూర్యప్రకాష్, మాజీ సర్పంచ్ బాల ముకుందం పాల్గొన్నారు. వారితో పాటు ఎంపీఓ రవి బాబు, నాయకులు మల్లారెడ్డి, అంకం సతీష్, మాజీ ఎంపీటీసీ శంకర్, రవీందర్ రావు, వార్డ్ సభ్యులు రాజకుమార్, కందుల లాస్య శేఖర్ గౌడ్, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




