-
బాలుడికి ‘ఆవిర్భవ్’గా పేరు పెట్టిన ఎమ్మెల్యే దంపతులు
-
ప్రభుత్వం తరపున రూ. 1.90 లక్షల చెక్కు పంపిణీ
-
బిడ్డ పెద్దయ్యే వరకు పోషణ బాధ్యత నాదే: ఎమ్మెల్యే భరోసా
ఖానాపూర్, ఏప్రిల్ 29 : తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పసిబిడ్డలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ దంపతులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉట్నూర్ మండలం రాంజీగోండ్ నగర్‌కు చెందిన ఆత్రం గంగుబాయి ప్రసవ సమయంలో మరణించగా, అంతకు నెల రోజుల ముందే ఆమె భర్త కూడా కన్నుమూశారు. దీంతో రెండేళ్ల పాప, అప్పుడే పుట్టిన పసికందు అనాథలుగా మారారు.
మాటిచ్చి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే
ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే మార్చి నెలలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆ పిల్లల పోషణ బాధ్యతను తానే స్వీకరిస్తానని మాట ఇచ్చారు. బిడ్డ పెద్దయ్యే వరకు పాలు, పౌష్టికాహార ఖర్చులను వ్యక్తిగతంగా భరిస్తానని, ప్రభుత్వం నుండి కూడా సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ పసిబిడ్డకు తన దంపతుల చేతుల మీదుగా ‘ఆవిర్భవ్’ అని నామకరణం చేశారు.
ఆవిర్భవ్ పోషణకు ఆర్థిక సాయం
ప్రభుత్వం నుండి మంజూరైన 1 లక్షా 90 వేల రూపాయల చెక్కును ఆవిర్భవ్ సంరక్షణ కోసం బాలుడి నాన్నమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “తల్లిదండ్రులు లేని లోటు ఆ బిడ్డలకు ఎవరూ తీర్చలేరు. కానీ ఆ బిడ్డ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, సమాజంలో గొప్పగా ఆవిర్భవించాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టాం” అని భావోద్వేగంతో తెలిపారు. ఎమ్మెల్యే దంపతులు పసిబిడ్డను ఎత్తుకొని నామకరణం చేస్తున్న దృశ్యం అక్కడి వారిని కదిలించింది.
ప్రభుత్వ యంత్రాంగం అభినందన
ప్రజా ప్రతినిధిగా ఉంటూ ఒక అనాథ బిడ్డకు తండ్రిలా అండగా నిలవడమే కాకుండా, స్వయంగా నామకరణం చేసి ఆర్థిక భరోసా కల్పించిన ఎమ్మెల్యేను స్థానికులు, అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పివిటిజి (PVTG) ఏపీవో ఆత్రం భాస్కర్, డీఈఓ, బాలుడి నాన్నమ్మ, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




