-
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దు.. ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది
-
ప్రతి నియోజకవర్గంలో ‘అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల’ ఏర్పాటు
-
ఏటీసీల్లో అగ్రికల్చర్ కోర్సును ప్రవేశపెడుతున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
ధర్మపురి, ఏప్రిల్ 28
: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారు విదేశాల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామితో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఏజెంట్ల బారిన పడకుండా ‘టామ్‌కామ్’ భరోసా
గల్ఫ్ వెళ్లే యువత ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ‘టామ్‌కామ్’ (TOMCOM) ద్వారా విదేశీ భాషలపై అవగాహన కల్పిస్తోందని మంత్రి అడ్లూరి తెలిపారు. ప్రభుత్వమే ఉద్యోగ భద్రత కల్పించి యువతను విదేశాలకు పంపిస్తుందని, నిరుద్యోగులు ఏజెంట్ల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ATC) ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
ఏటీసీల్లో అగ్రికల్చర్ కోర్సులు: మంత్రి వివేక్
కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నందున, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో నూతనంగా అగ్రికల్చర్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. జగిత్యాల జిల్లా నుండి టామ్‌కామ్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు తక్షణమే 30 మంది అభ్యర్థులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 1400 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు.
పుష్కరాల నాటికే అభివృద్ధి పనులు పూర్తి
2027 గోదావరి పుష్కరాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుచూపుతో పనులు ప్రారంభించారని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. గత పాలకులు పుష్కరాల సమయంలో నాణ్యత లేని పనులు చేసి భక్తులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఈసారి బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




