-
సఫలమైన చర్చలు.. వెనక్కి తగ్గిన యాజమాన్యం
-
‘స్టూడియో 18’ కథనానికి స్పందన.. సమస్య పరిష్కారంతో కార్మికుల హర్షం
షాబాద్, ఏప్రిల్ 26
: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి వద్ద గల ‘డై ఫుకు’ (Daifuku) ప్రైవేట్ కంపెనీలో తలెత్తిన కార్మిక వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. నెల రోజులుగా జీతాలు అందకపోవడం, ముందస్తు సమాచారం లేకుండా విధుల్లోంచి తొలగించడాన్ని నిరసిస్తూ శనివారం కార్మికులు కంపెనీ ముందు భారీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
మీడియా కథనాలకు స్పందన
కార్మికుల ఆవేదనను, యాజమాన్యం తీరును మరియు జర్నలిస్టులపై జరిగిన దాడిని ‘స్టూడియో 18’ న్యూస్ పత్రిక మరియు ఛానెల్ ప్రముఖంగా ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన యాజమాన్యం తన వైఖరిని మార్చుకుంది. ఆదివారం కార్మికులు, యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో కార్మికులకు రావలసిన ఒక నెల బకాయి జీతాన్ని యాజమాన్యం తక్షణమే చెల్లించింది.
కార్మికుల కృతజ్ఞతలు
తమ న్యాయమైన పోరాటం ఫలించి, వేతనాలు అందడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు లంబడి కిరణ్ కుమార్, బూత్ అధ్యక్షుడు వినయ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తమ గోడును ప్రభుత్వం మరియు ప్రజల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తోడ్పడిన మీడియా మిత్రులకు కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ పరిణామంతో గత రెండు రోజులుగా కంపెనీ వద్ద నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది.




