- బెంగళూరు ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో దారుణ ఘటన
- టాయిలెట్లో ప్రసవించి, పసికందును హత్య చేసిన యువతి
- అవివాహిత కావడంతో అవమాన భయంతోనే ఈ ఘాతుకం
- 19 ఏళ్ల ఉద్యోగిని రేణుకగా గుర్తింపు.. కేసు నమోదు
- నిందితురాలిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
వివరాల్లోకి వెళితే… ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 19 ఏళ్ల రేణుక అనే యువతి టాయిలెట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన వెంటనే, బిడ్డ గొంతు కోసి హత్య చేసి, మృతదేహాన్ని ఓ బ్యాగులో పడేసింది. ఈమె అవివాహిత కావడంతో సామాజిక అవమానానికి భయపడి ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కొంతసేపటి తర్వాత టాయిలెట్‌కు వెళ్లిన మరో ఉద్యోగిని, బ్యాగులో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి భయంతో పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు. శిశువు పుట్టిన తర్వాతే హత్యకు గురైనట్టు నిర్ధారించారు.
విచారణలో నిందితురాలిని రేణుకగా గుర్తించి, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. యువతి టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో అనుకోకుండా ప్రసవం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.




