-
కుషాయిగూడలో నిందితుడి ఇంటిని ముట్టడించిన బాధితులు -
ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ మోసాలపై రైతుల కరం
-
నిందితులను కఠినంగా శిక్షించాలని పాశం యాదగిరి డిమాండ్
కుషాయిగూడ, ఏప్రిల్ 21 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన అమాయక రైతులకు అండగా ఉండాల్సిన వారే నిలువునా ముంచిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. పరిహారం కింద వచ్చిన సుమారు రూ. 250 కోట్ల డబ్బును ‘ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్’ సంస్థ యజమానులు కాజేయడంతో ఆగ్రహించిన వందలాది మంది రైతులు మంగళవారం హైదరాబాద్‌లోని కుషాయిగూడలో భారీ ఆందోళన చేపట్టారు.
కుషాయిగూడలో ఉద్రిక్తత
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన సుమారు 25 గ్రామాల రైతులు, మంగళవారం ఉదయం కుషాయిగూడ సుభాష్ నగర్లో నివాసం ఉంటున్న నిందితుడు ఇట్యాల ధనుంజయ్ గుప్తా ఇంటిని ముట్టడించారు. దాదాపు 300 మంది బాధితులు నిందితుడి ఇంటి ముందు బైఠాయించి, తమ డబ్బు తమకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
నమ్మించి వంచించిన ‘ఘరానా’ దొంగలు
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ పేరుతో ఇట్యాల సాయిబాబా (ప్రధాన నిందితుడు), ధనుంజయ్, బాలీశ్వర్, తుకారాం, నాగం కరుణాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రెవెల్లి జానకిరామ్ రెడ్డి, తాడురి శ్రీనివాస్ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. భూనిర్వాసితులకు తక్కువ ధరలో భూములు ఇప్పిస్తామని, డిపాజిట్లపై భారీ వడ్డీ ఇస్తామని ఆశ చూపి సుమారు 3000 మంది రైతుల నుండి రూ. 250 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయామని గ్రహించిన రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, నిందితుల ఆస్తుల జప్తునకు కోర్టు ఆదేశించినట్లు సమాచారం.
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? – పాశం యాదగిరి
బాధితులకు సంఘీభావం తెలిపిన సామాజిక విశ్లేషకులు పాశం యాదగిరి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయడంలో అటు గత ప్రభుత్వం, ఇటు ప్రస్తుత ప్రభుత్వం విఫలమయ్యాయి. చట్టాలను తుంగలో తొక్కి భూనిర్వాసితుల పొట్టకొడుతున్నారు. ధనుంజయ్ గుప్తా వంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి మోసగాళ్లను సమాజం నుండి బహిష్కరించాలి. పౌర సమాజం అంతా రైతులకు అండగా నిలవాలి.”
న్యాయం జరిగే వరకు పోరాటం
ముప్పై ఏళ్లుగా వ్యవసాయమే నమ్ముకున్న తమకు ఇప్పుడు భూమి లేక, డబ్బు అందక రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరినీ కస్టడీలోకి తీసుకుని తమకు రావాల్సిన పరిహారం సొమ్మును ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని మరియు పోలీసులను వేడుకుంటున్నారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదని రైతులు హెచ్చరించారు.




