-
సభలో సీనియర్ నేతలకు దక్కని ప్రాధాన్యత
-
ఫ్లెక్సీలు, వేదికపై కనిపించని ఫోటోలు
-
అధిష్టానం కనుసన్నల్లోనే ‘నిరాదరణ’ జరిగిందా? చర్చనీయాంశంగా అంతర్గత విభేదాలు
జగిత్యాల, ఏప్రిల్ 20 (ప్రజా సాక్షి): జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అధికార కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు పార్టీ కేడర్‌ను సిద్ధం చేస్తున్న తరుణంలో, సొంత పార్టీలోని బీసీ సామాజిక వర్గ సీనియర్ నేతలకు జరుగుతున్న ‘అవమానం’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమ కాలం నుండి పార్టీని నమ్ముకున్న నేతలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెరపైకి తుల ఉమ, రాజేశం గౌడ్ పేర్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్‌గా, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తుల ఉమకు తాజా సభలో తీవ్ర అన్యాయం జరిగినట్లు ఆమె అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలలో కానీ, సభా వేదికపై ఉన్న ఫొటోలలో కానీ ఆమెకు కనీస స్థానం కల్పించకపోవడం గమనార్హం. అదేవిధంగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన గౌడ్ సామాజిక వర్గ సీనియర్ నేత రాజేశం గౌడ్ పరిస్థితి కూడా ఇలాగే ఉందని సమాచారం. కేసీఆర్‌తో కలిసి నాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఇలాంటి నేతలను ఇప్పుడు విస్మరించడం వెనుక స్థానిక నాయకత్వపు హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆధిపత్య పోరు.. లేక రాజకీయ కారణాలా?
ముఖ్య నేతలు హాజరవుతున్న సభలో, ఒక బీసీ మహిళా నాయకురాలిని మరియు అనుభవం ఉన్న సీనియర్లను కావాలనే విస్మరిస్తున్నారా? లేక పార్టీలోని కొందరు వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇలా చేస్తున్నారా? అనే కోణంలో చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని తుల ఉమ దంపతులు కలవడం కూడా ఈ పరిణామాలకు ఒక కారణమై ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
పార్టీకి నష్టం తప్పదా?
జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలను ఇలా బహిరంగంగా అవమానించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఈ విభేదాలను పరిష్కరించకుంటే, భవిష్యత్తులో కేడర్ లో అసహనం మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.




