-
మందమర్రి టోల్ ప్లాజా వద్ద ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు
-
ప్రాణాలను కాపాడే ‘గోల్డెన్ అవర్’, ‘సీపీఆర్’ పై ప్రత్యేక శిక్షణ
-
యమధర్మరాజు వేషధారణతో వాహనదారుల్లో చైతన్యం
మందమర్రి, ఏప్రిల్ 17 (ప్రజా సాక్షి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మందమర్రి టోల్ ప్లాజా వద్ద రోడ్డు భద్రతపై శుక్రవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “అరైవ్ అలైవ్” షెడ్యూల్లో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతను వివరించారు.
కీలకమైన గోల్డెన్ అవర్
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంట సమయం (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమయంలో బాధితులకు సరైన ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే ప్రాణాలకే ముప్పని హెచ్చరించారు.
సీపీఆర్‌పై ప్రాక్టికల్ శిక్షణ
ప్రమాద సమయంలో బాధితుడి శ్వాస ఆగిపోయినా లేదా గుండె పనిచేయకపోయినా వెంటనే చేయాల్సిన సీపీఆర్ (CPR) విధానంపై వైద్య నిపుణులు డాక్టర్ సిద్ధార్థ్, డాక్టర్ శైలేష్ ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు. డ్రైవర్లు, స్థానికులు ఈ ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా ఆపదలో ఉన్నవారిని కాపాడవచ్చని సూచించారు.
ఆకట్టుకున్న యమధర్మరాజు వేషధారణ
రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీసులు వినూత్నంగా యమధర్మరాజు, చిత్రగుప్తుని వేషధారణలతో ప్రదర్శన నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే యమపురి పాలు కావాల్సి వస్తుందంటూ వారు చేసిన హెచ్చరికలు వాహనదారులను ఆలోజింపజేశాయి. అనంతరం డీసీపీ చేతుల మీదుగా రోడ్డు పక్కన ఉండే షాపు యజమానులకు, డ్రైవర్లకు ఫస్ట్ ఎయిడ్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి సీఐ పర్స రమేష్, ఎస్ఐలు ఆంజనేయులు, గంగారాం, శ్రీధర్, నరేష్, వైద్య బృందం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ముఖ్య సూచనలు:
-
ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించడం సామాజిక బాధ్యత.
-
అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం మృత్యువుకు దారితీస్తుంది.
-
ప్రతి వాహనదారుడు తమతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంచుకోవడం ఉత్తమం.





