
సంగారెడ్డి ( నేషనలిస్ట్ వాయిస్ ప్రతినిధి) ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్ (MAC) సొసైటీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటిజన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో, సొసైటీ కమిటీ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో రక్తపోటు, షుగర్, ఈసీజీ, మామోగ్రామ్ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజారోగ్యం పట్ల అవగాహన కల్పించే ఇటువంటి శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన బీహెచ్ఈఎల్ మాజీ ఈడీ ఉదయ్ కుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. కార్డియాలజీ, గైనకాలజీ వంటి ప్రత్యేక విభాగాల్లో వైద్యులు రోగులకు ఉచితంగా సంప్రదింపులు జరిపి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సలీమ్, కార్యదర్శి నందగోపాల్, ఇతర సభ్యులు మరియు కాలనీ నివాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.


