పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఈ జలాలను అనకాపల్లికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో సాగు, తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు.
గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు, అనంతరం అరసవల్లి వరకు తీసుకెళ్లి వంశధార నదికి అనుసంధానం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానించి 12 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.3,200 కోట్లు ఖర్చు చేస్తామని, 2028 నాటికి వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు అందించడంతో పాటు పరిశ్రమలకు 23 టీఎంసీల నీటిని కేటాయిస్తామని చెప్పారు.
ఉత్తరాంధ్రలో డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్, ఫార్మా తదితర పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. అనకాపల్లి భవిష్యత్తులో రంగారెడ్డి తరహాలో అభివృద్ధి చెందుతుందని, ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గి ప్రాంతానికే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో రూ.35,000 కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు.


