-
బియ్యం సేకరించకుండా ఎఫ్సీఐ (FCI) ఎందుకు కాలయాపన చేస్తోంది?
-
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి
-
రైతులు అధైర్యపడొద్దు.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: క్షేత్రస్థాయిలో మంత్రి భరోసా
ధర్మారం, మే 19
: “ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తన కనీస బాధ్యతను పూర్తిగా విస్మరించింది. తప్పులన్నీ కేంద్రం వైపు పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం బీజేపీ నాయకులకు అలవాటుగా మారింది. గత మూడు పంటలకు సంబంధించిన రైస్ మిల్లర్ల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (FCI) ఎందుకు సేకరించడం లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి” అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సోమవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లు జరుగుతున్న తీరును, రైతులకు అందుతున్న మద్దతు ధరను, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న విధానాన్ని ఆయన స్వయంగా రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఎఫ్సీఐ నిర్వాకం.. మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు
అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటోందే తప్ప, ఆ ధాన్యాన్ని సేకరించే బాధ్యతను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణలో గడచిన మూడు పంటల ధాన్యాన్ని రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి, మిల్లర్ల వద్ద నిల్వ ఉంచిందని వివరించారు. నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ ద్వారా ఆ బియ్యాన్ని సేకరించాల్సిన కేంద్రం నిర్లక్ష్యం వహించడం వల్లే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోయాయని మండిపడ్డారు.
ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి వివరించి బియ్యం సేకరణ వేగవంతం చేయించాల్సిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ బాధ్యతను మరిచి రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశ ప్రధాని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర రైతాంగ సమస్యలపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వారి వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు.
తరుగు పేరిట కోతలు విధిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం దించుకునే సమయంలో ఏ గ్రేడ్, బీ గ్రేడ్ సాకులతో గానీ, తరుగు పేరిట గానీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రూ. 11.21 కోట్లతో రోడ్డు పనుల పరిశీలన
ధాన్యం కేంద్రం పరిశీలన అనంతరం, ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెగడపల్లి మండలం కీచులాటపల్లి వరకు రూ. 11.21 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 8 కిలోమీటర్ల నూతన బిటి రోడ్డు పనులను మంత్రి అడ్లూరి పరిశీలించారు. ఈ రహదారి పూర్తి అయితే ధర్మారం, పెగడపల్లి మండలాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు కూడా పెరుగుతాయని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక రైతులు, ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, సివిల్ సప్లైస్ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

