-
జగిత్యాలలో కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం
-
అధికార మార్పిడిపై సీఎం రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదం
-
జిల్లా ఎస్పీ కాంగ్రెస్ రంగు పూసుకుని విధులు నిర్వహించవద్దు
జగిత్యాల, మే 19
:
“తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారారు. ఆయనకు నిజంగా నైతిక విలువలు ఉంటే తక్షణమే తన శాసనసభ్యత్వ పదవికి రాజీనామా చేసి వెళ్లాలి. రాజకీయాల్లో నైతికత అనేది కేవలం భారతీయ జనతా పార్టీ (BJP)లో మాత్రమే ఉంది” అని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మంగళవారం జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. స్థానిక రాజకీయాలు, కేంద్ర విద్యాలయం భూమి కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరియు పోలీసుల పక్షపాత ధోరణిపై ఆయన నిప్పులు చెరిగారు.
రెండు ఎకరాల స్థలం ఎందుకొరకు? ప్రజలను మభ్యపెడుతున్నారు!
జగిత్యాల కేంద్రీయ విద్యాలయం అంశంపై ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంటే, జగిత్యాలలో మాత్రం కేవలం రెండు ఎకరాల స్థలాన్ని ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ పాఠశాల వల్ల ఇక్కడి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని.. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి పూర్తిస్థాయి స్థలాన్ని మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. స్థలం కేటాయించకుండానే రూ. 200 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తయ్యాయని జగిత్యాల ప్రజలను కాంగ్రెస్ నాయకులు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అసలు ఆ స్థలాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఇస్తాడా? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూసే బాధ్యత తనదని, ఎమ్మెల్యే కేవలం స్థలం ఇప్పిస్తే చాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు
రాష్ట్రంలో కాంగ్రెస్ వైఖరిపై స్పందిస్తూ.. 2021లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి 3 బుల్లెట్ కారిడార్లను మంజూరు చేస్తే, ఇప్పుడు వాటిని తానే తీసుకువచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. అసలు ఆ ప్రాజెక్టులు మంజూరైనప్పుడు రేవంత్ రెడ్డి ఏ పదవిలో ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. “మేము ఇక్కడికి వచ్చింది రాజకీయం చేయడానికే.. ఆ రాజకీయం ప్రజలకు సేవ చేయడం కోసమే” అని అరవింద్ తేల్చిచెప్పారు.
పోలీస్ బాధ్యత మరిచిన ఎస్పీ.. ధర్మదీక్షకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం
జిల్లా పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న శైలిపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ఎస్పీ (SP) కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకుని కాకుండా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. గతంలో జరిగిన ఇతర పార్టీల దీక్షలకు, సభలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో చెప్పాలన్నారు. ఈరోజు బీజేపీ శాంతియుతంగా చేపట్టాలని తలపెట్టిన ‘ధర్మదీక్ష’కు ఏ ప్రాతిపదికన అనుమతి నిరాకరించారని నిలదీశారు.
సొంత పార్టీ సీనియర్లకు గట్టి హెచ్చరిక
ఇదే క్రమంలో పార్టీలోని కొందరు అంతర్గత వ్యవహారాలపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ సొంత శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. “బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు పనిచేస్తే నిజాయితీగా, పార్టీ లైన్‌కు కట్టుబడి పనిచేయండి.. లేకపోతే ఇంట్లో కూర్చోండి” అంటూ కఠినంగా వ్యాఖ్యానించారు.
ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

