-
గుండెపోటుతో మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ. 5.50 లక్షల నష్టపరిహారం
-
కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, మే 19
:
కార్మిక రంగానికి పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి అనునిత్యం కృషి చేసే పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (GMR) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన ఓ నిరుపేద కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి, మెరుగైన నష్టపరిహారం ఇప్పించి ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు.
కంపెనీలో విధులు నిర్వహిస్తూ..
వివరాల్లోకి వెళ్తే.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో గల ‘స్మార్కో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీలో కృష్ణారెడ్డి (35) అనే యువకుడు కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే అతడు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. అత్యంత నిరుపేద కుటుంబ నేపథ్యం కలిగిన కృష్ణారెడ్డి మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానిక బీఆర్ఎస్ (BRS) నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే జీఎంఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన ఎమ్మెల్యే.. క్యాంప్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ
బాధిత కుటుంబ పరిస్థితిని విని వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీఎంఆర్.. స్మార్కో పరిశ్రమ యాజమాన్యంతో అత్యవసరంగా మాట్లాడారు. మానవతా దృక్పథంతో కార్మిక కుటుంబానికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యాజమాన్యం.. రూ. 5 లక్షల నష్టపరిహారంతో పాటు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మరో రూ. 50 వేలు అందజేసేందుకు అంగీకరించింది.
ఈ మేరకు పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. ఎమ్మెల్యే జీఎంఆర్ సమక్షంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 5,50,000 ల నష్టపరిహారం నగదును అందజేశారు.
కార్మికుల కష్టాలు నాకు తెలుసు: ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా కార్మిక నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే కార్మికుల కష్టనష్టాలు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని కార్మిక రంగానికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే లాభాలే ధ్యేయంగా కాకుండా, పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల భద్రతకు, ప్రాణాలకు పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఐలా పటాన్చెరు అధ్యక్షులు సుధీర్ రెడ్డి, పాశమైలారం వైస్ చైర్మన్ రాఘవరెడ్డి, ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, రమణారెడ్డి, లక్ష్మణరావు, సురేష్, రంజిత్, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, చంద్రశేఖర్, మధు మరియు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

