-
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ధర్పల్లి పోలీసుల వినూత్న కార్యక్రమం
-
వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఎస్ఐ ఎల్. రామ్
-
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు
ధర్పల్లి, మే 19
:
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పరిధిలోని గుడితాండా (సితాయిపేట్) గ్రామ కేంద్రంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ‘మన ఊరు – మన భద్రత.. మన బాధ్యత’ అనే అంశంపై మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఎల్. రామ్ తాండా వాసులతో నేరుగా సమావేశమై శాంతిభద్రతలు, సైబర్ నేరాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఎండల తీవ్రతపై అప్రమత్తత.. సైబర్ మోసాలపై నిఘా
ఈ సందర్భంగా ఎస్ఐ రామ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవి తీవ్రత, ఎండలు ఎక్కువగా ఉన్నందున గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు మరియు చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దన్నారు.
అనంతరం పెరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరిస్తూ.. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP)లు, బ్యాంకు వివరాలు చెప్పకూడదని హెచ్చరించారు. ఆన్లైన్ లో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.
హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి
రహదారి భద్రతపై ఎస్ఐ ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపే వారు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. మైనర్ పిల్లలకు (వయస్సు నిండని వారికి) ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇస్తే ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత అవుతుందని, వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గుడితాండా సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, తాండా పెద్దలు, యువకులు, మహిళలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

