-
యాజమాన్యానికి, కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాల సమర్పణ
-
కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటం
కాసిపేట, మే 16
: మంచిర్యాల జిల్లా కాసిపేట్ మండలం దేవాపూర్ లోని అదానీ (ఓరియంట్) సిమెంట్ ఫ్యాక్టరీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న లోడింగ్ కార్మికులను తక్షణమే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఫ్యాక్టరీ గుర్తింపు యూనియన్ ‘ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్’ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధనలో భాగంగా శుక్రవారం వారు ఫ్యాక్టరీ యాజమాన్యానికి, కార్మిక శాఖ (లేబర్ డిపార్ట్మెంట్) అధికారులకు విడివిడిగా వినతిపత్రాలు (మెమోరాండం) అందజేశారు.
నిరంతర స్వభావం గల పని.. కాంట్రాక్ట్ ఎందుకు?
ఈ సందర్భంగా యూనియన్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో లోడింగ్ కార్మికులు చేస్తున్న పని నిరంతర స్వభావం (పెర్నమెంట్ నేచర్) కలిగినదని, అయినప్పటికీ వారిని ఇంకా కాంట్రాక్ట్ విధానంలోనే ఉంచడం అన్యాయమన్నారు. తక్షణమే ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, సదరు కార్మికులందరికీ శాశ్వత ఉద్యోగ హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల సంక్షేమమే మా లక్ష్యం
ప్రముఖ కార్మిక నాయకులు కొక్కిరాల సత్యపాల్ రావు నాయకత్వంలో పనిచేస్తున్న ప్రస్తుత గుర్తింపు యూనియన్.. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. యాజమాన్యం స్పందించి లోడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే కార్మిక శ్రేణులను ఏకం చేసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో లోడింగ్ కార్మికులు పాల్గొన్నారు.

