-
నిరుద్యోగులతో కలిసి ‘ఆస్పిరెంట్ అడ్డా’లో టీ తాగి నిరసన
-
జీవో 29, జీవో 46లను తక్షణమే రద్దు చేయాలి
-
మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల హామీ నీటిమూటలైంది
ఎల్బీనగర్, మే 16 
: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగుల ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత స్వయంగా ఏర్పాటు చేసుకున్న “ఆస్పరెంట్ అడ్డా- టీ పాయింట్” వద్ద ఆయన నిరుద్యోగులతో కలిసి టీ తాగుతూ ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రాహుల్, ప్రియాంక గాంధీల హామీలు ఎటుపాయె?
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో నిరుద్యోగులను కలిసి ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. పారదర్శక నియామకాలు, ‘జాబ్ క్యాలెండర్’ విడుదల, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. అలాగే ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించిన “యూత్ డిక్లరేషన్” లోని సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ₹5 లక్షల ‘విద్యా భరోసా కార్డు’, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల వంటి వాగ్దానాలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ మాటలను నమ్మి యువత ఊరు ఊరు తిరిగి ఆ పార్టీని గెలిపిస్తే.. నేడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను ప్రభుత్వం ఘోరంగా నిరాశలోకి నెట్టిందని ధ్వజమెత్తారు.
మెగా డీఎస్సీపై స్పష్టత లేదు..
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఎటు పోయిందని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం: హెచ్చరిక
నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న జీవో 29 మరియు జీవో 46లను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో చోటుచేసుకున్న పలు అనుమానాలపై సిట్ (SIT) ఎంక్వయిరీ నిర్వహించి పారదర్శక విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ మరియు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రనాయక్, శంకర్, శింబు నాయక్, భూక్యా కుమార్, నవీన్ పట్నాయక్, సింధురెడ్డి, ఆకాష్, అంజలి, శ్రీదేవి, అశోక్, నందు, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

