-
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
-
జిల్లావ్యాప్తంగా పీస్ కమిటీ సమావేశాలు.. నిరంతర నిఘా
-
అక్రమ రవాణా నిరోధానికి డీఎస్పీల పర్యవేక్షణలో 24×7 చెక్‌పోస్టులు
సంగారెడ్డి, మే 14 
: రాబోయే బక్రీద్ పండుగను జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లకు తావులేకుండా, పరస్పర సహకారం మరియు మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (IPS) ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కులాలు, మతాల పెద్దలు, ప్రజాప్రతినిధులతో ‘పీస్ కమిటీ’ (శాంతి సంఘం) సమావేశాలు నిర్వహించారు.
పశువుల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ.. పండుగ సందర్భంగా జిల్లా నుండి ఎలాంటి పశువుల అక్రమ రవాణా జరగకుండా జిల్లా నలుమూలలా ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ చెక్‌పోస్టులు 24 గంటల పాటు (24×7) నిరంతరాయంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాపై సైబర్ నిఘా.. కఠిన హెచ్చరికలు
పండుగ సమయంలో సమాజంలో విద్వేషాలు రేకెత్తించేలా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను, పుకార్లను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. జిల్లా సైబర్ క్రైమ్ విభాగం ద్వారా సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.
అప్రమత్తంగా ఉండండి: సహాయం కోసం డయల్ 100
జిల్లా ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలను గమనించినా వెంటనే అప్రమత్తం కావాలని కోరారు. సమాచారం కోసం సమీప పోలీస్ స్టేషన్‌ను గానీ, పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్: 8712656739 లేదా డయల్-100 కు ఫోన్ చేసి వివరాలు అందించాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాను ప్రశాంతతకు నిలయంగా ఉంచేందుకు, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ విజ్ఞప్తి చేశారు.

