-
నిందితుడు ‘గోల్డెన్ థీఫ్’ సుభోద్ సింగ్ గ్యాంగ్‌గా గుర్తింపు
-
ముగ్గురు అరెస్ట్.. పరారీలో ఉన్న వారి కోసం 5 బృందాలతో గాలింపు
-
వివరాలు వెల్లడించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కరీంనగర్, మే 14
: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ PMJ జ్యువెలరీ దుకాణం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) గౌస్ ఆలం గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
‘గోల్డెన్ థీఫ్’ స్కెచ్.. పక్కా ప్లాన్‌తో దోపిడీ
సీపీ కథనం ప్రకారం.. దేశవ్యాప్తంగా వందలాది చోరీలకు పాల్పడి “ది గోల్డెన్ థీఫ్”గా పేరుగాంచిన సుభోద్ సింగ్ నేతృత్వంలోని ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. ప్రధాన నిందితుడు జగీరా సింగ్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 51 వేల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు మరియు నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 82 లక్షల విలువైన ఆభరణాల మాయం
ఈ దోపిడీలో నిందితులు సుమారు 161.4 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 82 లక్షలు ఉంటుందని అంచనా. దోపిడీకి ముందు ఈ ముఠా ఖమ్మం, సిద్ధిపేట, పెద్దపల్లి మరియు కరీంనగర్ ప్రాంతాల్లోని ప్రముఖ జ్యువెలరీ దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని సీపీ తెలిపారు.
గాలింపు ముమ్మరం
కేసులో ఇంకా పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. నిందితులు దొంగిలించిన బంగారాన్ని ఎక్కడ విక్రయించారు? వీరికి స్థానికంగా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అత్యంత చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా సీపీ అభినందించారు.

