-
నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు

-
కలెక్టరేట్లో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు
-
కార్మిక శాఖ ‘అచీవ్మెంట్స్’ బుక్లెట్ ఆవిష్కరణ
నిర్మల్, మే 02 : ప్రపంచ అభివృద్ధి చక్రం ముందుకు సాగాలంటే కార్మికులే కీలకమని, వారు తమ వృత్తుల్లో నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకొని కార్మిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
నైపుణ్యంతోనే అంతర్జాతీయ అవకాశాలు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికులు కేవలం శ్రమకే పరిమితం కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. “నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రస్తుతం విదేశాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కార్మికులు సిద్ధంగా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
చట్టాలపై అవగాహన అవసరం
ప్రతి కార్మికుడు తమ హక్కులు మరియు కార్మిక చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కార్మికుడికి అందాలన్నదే జిల్లా యంత్రాంగం లక్ష్యమని తెలిపారు. అనంతరం కార్మిక శాఖ రూపొందించిన “అచీవ్మెంట్స్ అండ్ ఆక్టివిటీస్” బుక్‌లెట్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ కార్మికులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. అధికారులు, కార్మిక సంఘాల నేతలు కలెక్టర్‌ను గౌరవపూర్వకంగా సన్మానించారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ముత్యం రెడ్డి, జిల్లా కార్మిక శాఖ అధికారి రాజలింగు, జిల్లా ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, నాయకులు కోటిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




